జాతీయం

గవర్నర్‌కు మాతృ వియోగం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి (80) బుధవారం ఉదయం కన్నుమూశారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ప్రైవేటు దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని రాజ్‌భవన్‌లో ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం తమిళనాడు తీసుకువెళ్లారు. చన్నైలోని సాలిగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళిసై మాతృమూర్తి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో తమిళిసైని పరామర్శించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు స్టాలిన్‌, రంగస్వామి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

మంత్రులు, ప్రముఖుల పరామర్శ
రాజ్‌భవన్‌లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కృష్ణకుమారి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. గవర్నర్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు. శాసనమండలి చైర్మన్‌ప్రొటెం భూపాల్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్ధసారథి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహచార్యులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు నివాళులర్పించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎస్‌ నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు.