అంతర్జాతీయం

అష్రఫ్‌ ఘనీకి అరబ్‌ ఎమిరేట్స్‌ ఆశ్రయం

  • మానవతా దృక్పథంతోనే అంగీకరించాం
  • యూఏఈ వెల్లడి

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ యూఏఈలో తలదాచుకున్నారు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు. ఘనీకి, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించడానికి ఒప్పుకున్నామని యూఏఈ బుధవారం తెలిపింది. యూఏఈలో ఆయన ఎక్కడ ఉన్నదీ మాత్రం వెల్లడించలేదు.

‘డబ్బుతో పారిపోలేదు’
కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ చేతుల్లోకి వెళ్లి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్ల నిండా భారీ నగదుతో దేశం నుంచి పరారయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తొలిసారిగా దీనిపై వివరణ ఇచ్చారు. తాను డబ్బుతో పరారైనట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాలిబన్లు వస్తున్నారని, వెంటనే వెళ్లిపోవాలని తన భద్రతా విభాగం కోరిందని, కనీసం బూట్లను మార్చుకునే సమయం కూడా లేదన్నారు. మరోవైపు మాతృదేశాన్ని అమ్మేసి పారిపోయిన ఘనీని అరెస్ట్‌ చేయాలని ఆ దేశ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్‌ ఇంటర్‌పోల్‌ను కోరారు.