ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి.. గురువారం ఉదయం‌ వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిందిగా స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు ఆయన వెల్లడించారు. మానవాళిని కనికరించి ప్రపంచాన్ని అభివృద్ది చేసే దిశగా ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.