టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. దళితబంధుపై అక్కసుతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కేపీ వివేకానందతో కలిసి గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రేపో మాపో జైలుకు పోక తప్పదన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. రేవంత్‌ను నమ్ముకున్న వాళ్లు రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదని అన్నారు. దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. దళిత ద్రోహి రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు ఆపకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని వెల్లడించారు. రాబోయే 20 ఏండ్లు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్ సభను ఆపితీరుతామని హెచ్చరించారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్: జీవన్ రెడ్డి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని దోచుకున్నది నెహ్రూ కుటుంబమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగానే రేవంత్ రెడ్డికి పీసీపీ పదవి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రైవేటు రంగంలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామన్నారు. గురుకులాలు ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని, ప్రతీ విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామని, సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఎందరో ఉద్యమకారులకు రాజకీయ భవిష్యత్ కల్పించిన నేత సీఎం కేసీఆర్ అని చెప్పారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే: ఎమ్మెల్యే ఆల
రేవంత్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకట్ రెడ్డి సూచించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే విపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు లేదన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. దళితబంధు లాంటి పథకాలను గుడ్డిగా విమర్శించొద్దని సూచించారు.