- పోటాపోటీగా నేతల పాదయాత్రలు
- రాష్ట్రంలో ప్రహసనంగా బీజేపీ పరిస్థితి
- బండి, కిషన్‌రెడ్డి మధ్య ముదిరిన వర్గపోరు
- పార్టీపై పట్టుకోసం సొంతంగా యాత్రలు
- కొత్తపార్టీలో ఉనికికోసం ఈటల పోరాటం
- సోషల్ మీడియాలో మూడువర్గాల వార్
రాష్ట్ర బీజేపీలో వర్గపోరు ముదిరిపాకానపడుతున్నది. పార్టీపై పట్టు సాధించేందుకు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులాఉన్న ఆధిపత్యపోరు.. ఇప్పుడు బహిర్గతమైంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చేపడుతున్న యాత్రలే దీనిని రుజువుచేస్తున్నా యి. ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్రను చేపట్టగా.. బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ యాత్ర ముందే ప్రారంభం కావాల్సి ఉన్నా.. దానికి బ్రేకులు వేసిన కిషన్‌రెడ్డి ఆశీర్వాదయాత్ర పేరుతో మరో యాత్రను ప్రారంభించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీలు కాకముందు నుంచే వీరిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నట్టు తెలిసింది. కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవిదక్కడంతో.. బండి సంజయ్ మరింత నిరాశకు గురైనట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కాక బండి సంజయ్ పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తుంటే కిషన్‌రెడ్డి కళ్లెం వేస్తూవస్తున్నారు. వీరిద్దరి వ్యవహారం మధ్య కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పరిస్థితి రెంటికిచెడ్డ రేవడిగా మారింది. బీజేపీలో ఆయనను పట్టించుకునేనాథుడే లేకుండాపోయాడు. హుజురాబాద్ ఉపఎన్నికను కూడా బీజేపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడంతో ఉనికికోసం పాకులాడుతున్నారు. మొన్నటివరకు ఈటల చేపట్టిన పాదయాత్ర విఫలం కావడంతో ఆనారోగ్యం సాకుగా చూపి మధ్యలోనే ముగించారనే ప్రచా రం సాగుతున్నది. ఇక చేసేదిలేక ఆయన సొంత ఎజెండాతోనే ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.
సోషల్ మీడియాలో మూడువర్గాల పోరు
అటు కిషన్‌రెడ్డి, ఇటు బండి సంజయ్.. మధ్యలో ఈటల వర్గాలుగా విడిపోయినట్టు బీజేపీ సోషల్‌మీడియా పోస్టులను బట్టి అర్థమవుతున్నది. ఒకరిపై ఒకరు సోషల్‌మీడియా వేదికగా పోరు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. బండి, కిషన్‌రెడ్డి మద్దతుదారులు ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. వీరిద్దరినీ ఈటల వర్గీయులు టార్గెట్ చేస్తున్నారు. తమ నాయకుడి యాత్రకు బ్రేక్ వేసి కిషన్‌రెడ్డి ఆశీర్వాదయాత్ర చేపట్టడంపై బండి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కిషన్‌రెడ్డి యాత్రపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా బండి డైరెక్షన్‌లోనే జరుగుతున్నట్టు పార్టీవర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు తమ నాయకుడికి పార్టీలో ఒక్కరు కూడా సహకరించడం లేదంటూ ఈటల వర్గీయులు ఇటు బండి సంజయ్, అటు కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
యాత్రలపై గుస్సా
ఈ నెల 24 నుంచి బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామయాత్రపై బీజేఈ సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. సొంత ఎజెండా, సొంత లాభం కోసమే యాత్రను చేపడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే బండి యాత్రకు క్షేత్రస్థాయిలో సహకరించొద్దని మెజార్టీ నాయకులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈటల పాదయాత్రలో అన్నీ తామై వ్యవహరించిన ఇద్దరు సీనియర్ నేతలు ఈ మేరకు పట్టించుకోవద్దని సూచించినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు యాత్ర చేయాల్సిన అవసరమేం వచ్చిందని పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపథకాలు ఇంటింటికీ అందుతున్నప్పుడు.. వారికేమీ చెప్తామని పార్టీ సమావేశంలోనే ప్రశ్నించినట్టు సమాచారం. కేంద్రం పథకాల గురించి ప్రచారం చేసుకుందామన్నా.. చెప్పుకోదగ్గ స్థాయిలో ఏంచేశామని నిట్టూర్చారని వినికిడి. ఇలాంటి సందర్భంలో యాత్ర చేపడితే ప్రజల్లో చులకనవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు వ్యక్తంచేసినట్టు తెలిసింది.
‘బండి’బాగోతం.. ఆడియో వైరల్
బీజేపీ కార్యకర్తలు, నేతలకు బండి సంజయ్ చేస్తున్న అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రెండ్రోజుల క్రితం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ఫోన్‌చేసిన ఓ బీజేపీ కార్యకర్త తనకు బండి సంజయ్ చేసిన మోసం చెప్పుకొని భోరుమన్నారు. ఈ ఆడియో వైరల్‌గా మారింది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ ఒకరు ఈ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వివరించి.. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. స్పందించిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.