నీళ్లంటే మీకు సరదానా? ఆ నీటిలో కయాకింగ్ ( Kayaking ), బోటింగ్ ( Boating ) ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఇక ఆలస్యమెందుకు.. అనంతగిరి కొండలకు సమీపంలో ఉన్న కోట్‌పల్లి రిజర్వాయర్‌కు వెళ్దాం పదండి.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలకు 12 కిలోమీటర్ల దూరంలో కోట్‌పల్లి రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్‌లో ఫారెస్టు అధికారులు కయాకింగ్, బోటింగ్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో కయాకింగ్, బోటింగ్ ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు వీకెండ్‌లో ఆ రిజర్వాయర్‌కు భారీగా తరలివెళ్తున్నారు.
పర్యాటకులను ఆకర్షిస్తున్న ‘కయాకింగ్’
కోట్‌పల్లి రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కయాకింగ్ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సింగిల్ సీటు ఉన్న కయాకింగ్‌కు అయితే రూ. 200, డబుల్ సీటు ఉన్న దానికి అయితే రూ. 300 ఛార్జీ వసూలు చేస్తారు. కయాకింగ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ అందజేస్తారు. గార్డ్స్ కూడా అందుబాటులో ఉంటారు. అయితే 80 కేజీల కంటే బరువు ఎక్కువగా ఉన్న వారిని అనుమతించరు. పదేళ్ల లోపు చిన్నారులకు కూడా అనుమతి లేదు. వారాంతాల్లో ఈ ప్రాంతం పర్యాటకులతో నిండి పోతోంది.
కోట్‌పల్లి రిజర్వాయర్‌కు ఎలా వెళ్లాలంటే..?
ఈ రిజర్వాయర్ హైదరాబాద్ నుంచి 138 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుంచి 12 కిలోమీటర్లు. కోట్‌పల్లికి వెళ్లాలంటే ధరూర్ చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ధరూర్ చౌరస్తా నుంచి కోట్‌పల్లి రిజర్వాయర్ 6 కిలోమీటర్లు మాత్రమే. సొంత వాహనం లేని వారికి అందుబాటులో ప్రైవేట్ ఆటోలు ఉంటాయి.
అక్కడ ఆహారం దొరుకుతుందా?
కోట్‌పల్లి రిజర్వాయర్ వద్ద పర్యాటకులకు ఆహారం దొరుకుతుంది. కొన్ని స్టాల్స్ స్థానికులు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. వేడి వేడి మ్యాగీ న్యూడిల్స్, కోడిగుడ్లు, చికెన్ కబాబ్, చాయ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ స్టాల్స్ సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటాయి.
అక్కడే బస చేయొచ్చా?
ఒక వేళ ఆ రాత్రి అక్కడే బస చేయాలనుకుంటే.. ఆ సౌకర్యం కూడా ఉంది. హరిత హాటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్క రోజుకు రూ. 1800 ఛార్జీ వసూలు చేస్తారు. వారాంతాల్లో అయితే ఈ ఛార్జీకి అదనంగా రూ. 500 వసూలు చేస్తారు.