తెలంగాణ

విప‌క్షం ఆగ‌మాగం.. నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు

  • ఫిర్యాదులతో అధిష్ఠానాలకు తలబొప్పి
  • కాంగ్రెస్‌ సీనియర్ల ఫిర్యాదుతో రంగంలోకి రాహుల్‌
  • బండి సంజయ్‌కి కిషన్‌రెడ్డితో చెక్‌ పెడుతున్న బీజేపీ హైకమాండ్‌
  • సొంత వ్యూహంతో ఏకాకి అయిన ఈటల రాజేందర్‌

ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల తీరు. ఒకటిన్నర సభలు పెట్టి, నాలుగు సినిమా డైలాగులు చెప్పి ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని జబ్బలు చరుచుకొంటున్నారు. రెండేండ్లలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పగటి కలలు కంటున్నారు. వారి ఒంటెద్దు పోకడలతో సొంతపార్టీల్లోనే సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయినా ఆ పార్టీల సారథుల తీరు మార్చుకోకపోవటంతో సీనియర్లంతా హస్తిన బాట పడుతున్నారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో ఆయా పార్టీల ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకొంటున్నారు. వీరివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్‌, బీజేపీలోని సీనియర్లు వాపోతున్నారు.

రేవంత్‌పై గరంగరం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరిపై ఆ పార్టీ సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని సమాచా రం. గురువారం ఇందిరాభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యంఠాగూర్‌కు కొందరు సీనియర్లు రేవంత్‌పై ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. మరికొందరైతే అధిష్ఠానంతోనే తేల్చుకొనేందుకు ఢిల్లీలో తిష్ఠ వేసినట్టు సమాచారం. సీనియర్లను చల్లబర్చేందుకు మాణిక్యం ఠాగూర్‌ పలువురు నేతలతో విడివిడిగా భేటీ అయినట్ట్టు తెలిసింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాల పేరుతో రేవంత్‌రెడ్డి చేపట్టిన సభలు పార్టీవా? ఆయన సొంత డబ్బా కోసం పెట్టుకున్నవా? అని మాణిక్యంఠాగూర్‌ను పలువురు ఘాటుగానే నిలదీసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా ఏఐసీసీ కార్యక్రమాల అమలు రాష్ట్ర కమిటీ ఖరారు చేయాలి తప్ప టీపీసీసీ అధ్యక్షుడు ఒక్కడే ఎలా నిర్ణయిస్తారని ఆ కమిటీ సభ్యులు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. రేవంత్‌కు ముకుతాడు వేసేందుకు రాష్ట్రంలో ఏదో ఒక సభ కు రాహుల్‌గాంధీ వచ్చేలా చూడాలన్న సీనియర్ల సూ చనతో వరంగల్‌ సభకు హాజరుకావడానికి ఆయనను ఒప్పించినట్టు సమాచారం. తన జిల్లా పరిధిలో నిర్వహించిన సభకు తననే సంప్రదించలేదని ఓ జాతీయస్థాయి నేత మాణిక్యంఠాగూర్‌ ముందు వాపోయిన ట్టు తెలిసింది. రాష్ట్ర ప్రచార కమిటీ ముఖ్యనేత కూడా రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

బండికి అధిష్ఠానం చెక్‌

కాంగ్రెస్‌ దండోరా సభలతో తానెక్కడ వెనుకబడిపోతానో అన్న భయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో కార్యక్రమాన్ని గత నెలలోనే ఖరారు చేసుకున్నారు. దీనికి అడ్డుకట్ట వేసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన పాదయాత్రను మొదలుపెట్టారు. అధిష్ఠానం సూచన మేర కే ఈ యాత్ర మొదలుపెట్టారని సమాచారం. పోటాపోటీ యాత్రలతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. బండిపై ఢిల్లీ పెద్దలకు రోజూ ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయని ఆ పార్టీవర్గాలు అంటున్నాయి. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి మధ్య అధిపత్యపోరుతో కొత్తగా కాషాయ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల అభ్యర్థిగా తనకు తానే ప్రకటించుకొని పాదయాత్ర ప్రారంభించిన ఈటల వైఖరిపై పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

మైనంపల్లిని కలిసిన కమలం నేతలు?

కరీంనగర్‌ జిల్లాకు చెందిన బీజెపీ సీనియర్‌ నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసినట్టు తెలిసింది. బండి సంజయ్‌ తమ జిల్లాలో సీనియర్లను పక్కనపెట్టి సొంత ఎజెండాతో పార్టీని ఎలా దెబ్బతీస్తున్నారో వారు వివరించినట్టు సమాచారం. బండి అనైతిక కార్యకాలాపాలపై కూడా వారు మైనంపాటికి ఉప్పు అందించినట్టు తెలిసింది.