ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. శనివారం కాబూల్‌కు ప్రతిరోజూ రెండు భారతీయ విమానాలు నడపడానికి బలగాలు భారత్‌కు అనుమతి ఇచ్చాయి. నాటో దళాలు.. తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
భారతీయ వైమానిక దళం (IAF) రవాణా విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి కొంతమంది ఆఫ్ఘన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించింది. అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాబూల్ సహా దాదాపు అన్ని కీలక పట్టణాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.