తెలంగాణ ముఖ్యాంశాలు

బీజేపీ అమ్మకం.. టీఆర్‌ఎస్‌ నమ్మకం

  • తెలంగాణకు ఏం ఒరగబెట్టారని యాత్రలు
  • రాష్ర్టానికి ఒక్క పైసా అయినా ఎక్కువిచ్చారా?
  • కుటుంబ రాజకీయాలపై మీరా మాట్లాడేది?
  • ఆదర్శంగా తీసుకుంటూ అడ్డగోలు విమర్శలా!
  • పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై ఏమంటారు?
  • జనానికి పొట్ట తిప్పలు.. మోదీకి ఫొటో తిప్పలు
  • ప్యాకేజీల పేరుతో ప్రజల చెవుల్లో క్యాబేజీలు
  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి, విప్‌ బాల్క సుమన్‌ ఫైర్‌

దేశవ్యాప్తంగా బీజేపీ అంటే అమ్మకం.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అంటే నమ్మకమైన పార్టీఅని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అభివర్ణించారు. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఆయా సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. అదే టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతున్నారని చెప్పారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విప్‌ బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ర్టానికి ఏం ఒరగబెట్టారని యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కన్నా అదనంగా ఒక్కపైసా అయినా కేంద్రం నుంచి తెచ్చారా? అని నిలదీశారు. కిషన్‌రెడ్డి విఫలయాత్ర చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుసని స్పష్టంచేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

ఆశీర్వాదం పేరిట అబద్ధాలు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. బీజేపీ అంటేనే మోసపూరిత పార్టీ అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోగా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించటమే పనిగా పెట్టుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. మాయమాటలతో ఓట్లు దండుకోవటం మినహా బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీలేదని స్పష్టంచేశారు. అంకెలు, సంఖ్యలు చెప్పి కిషన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని.. బండి సంజయ్‌లా పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని హితవు పలికారు. పిచ్చి మాటలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న సీటును బీజేపీ కోల్పోయిందని, మున్సిపల్‌, నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో అదే ఫలితం పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో ప్రజలపై భారం మోపి.. ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేస్తున్నారని ఎర్రబెల్లి నిలదీశారు.

కేంద్ర అశ్రద్ధ వల్లే కరోనా మరణాలు
ప్రధాని మోదీ ఆశ్రద్ధ చేయటం వల్లే దేశంలో కరోనా మరణాలు పెరిగాయని ఎర్రబెల్లి విమర్శించారు. సకాలంలో స్పందించి సౌకర్యాలు కల్పించి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కరోనాను కట్టడిచేశామని, ఇంటింటికీ జ్వర సర్వేతో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర మంత్రులందరూ తెలంగాణలో మంచి పాలన అందుతున్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రశంసిస్తుంటే.. కిషన్‌రెడ్డి ఇక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీలు తేవడంతో బీజేపీ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. తమ నియోజకవర్గాల మీద ప్రేమ ఉంటే సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేయించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ కోతల, కొరతల సర్కారు: బాల్క సుమన్‌
కేంద్రంలోని బీజేపీ కోతల, కొరతల సర్కార్‌ అని విప్‌ బాల్క సుమన్‌ అభివర్ణించారు. ప్యాకేజీల పేరుతో ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై, వారసత్వ రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కుటుంబ రాజకీయవారసుల జాబితాను ఆయన విడుదల చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంపద సృష్టించి దాన్ని ప్రజల క్షేమం కోసం పంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంపదను కొల్లగొట్టి గుజరాతీలకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. గుజరాతీలకు గులామీలుగా ఉంటారా? తెలంగాణ ప్రయోజనాల వైపు ఉంటారా? తేల్చుకోవాలని సవాల్‌చేశారు. అబద్ధాల మోదీకి అభివృద్ధి కేసీఆర్‌కు మధ్య పొంతనే లేదని స్పష్టంచేశారు. దేశ చరిత్రలో పాలన చేతగాక ఏడ్చిన ఏకైక ప్రధాని మోదీయేనని చెప్పారు. చేతగాని మోదీ దిగిపోవాలని సోషల్‌మీడియా వేదికగా గంటలోనే దేశంలోని 14 కోట్ల మంది డిమాండ్‌ చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజలకు పొట్టతిప్పలుంటే.. మోదీకి ఫొటో తిప్పలు ఉన్నాయని, దేశ చరిత్రలో మోదీ తరహా వ్యక్తిగత ప్రచారాన్ని కోరుకున్న మరో ప్రధానిలేరని ధ్వజమెత్తారు.

బీజేపీ గడ్డ.. నేరస్థుల అడ్డా
బీజేపీ గడ్డ.. నేరస్థుల అడ్డా అని బాల్క సుమన్‌ విమర్శించారు. దేశంలో అనేక నేరాలు చేసి, ప్రజల సొమ్మును లూటీ చేసిన వారంతా బీజేపీలో చేరగానే పునీతమైపోతారా? అని ప్రశ్నించారు. అనేక రాష్ర్టాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఎంతోమందిని బీజేపీలో కలుపుకొని అక్కున చేర్చుకుంటున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఎస్సీల, ఆలయ భూములను ఆక్రమించుకున్న ఈటలను చేర్చుకున్నారని పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో, వ్యాక్సిన్‌ కోసం, లాక్‌డౌన్‌లో వలస కూలీలను నడిరోడ్లపై నిలబెట్టిన ప్రధాని మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పటం తథ్యమన్నారు. మోదీ చెప్పే అచ్ఛే దిన్‌ మాట ఏమోకానీ ప్రజలకు సచ్చే దిన్‌ దాపురించిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బిల్డప్‌ ఎకువ బిజినెస్‌ తకువ పార్టీగా దేశప్రజలు గుర్తించారని చురకలేశారు. కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రైతు ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు, ఎంపీలు చవటలు, దద్దమ్మలని.. ఇప్పటికైనా తమ భాష మార్చుకోవాలని హితవు పలికారు.

కుంకుమ భరిణలు పంచటానికి సిద్ధమైన ఈటల
ఈటలకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే నైతిక హక్కేలేదని విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే గోడ గడియారాలు, కుట్టుమెషిన్లు, సెల్‌ఫోన్లు ఎందుకు పంచుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ప్రజలతో ఈటలకు భావోద్వేగ బంధమేలేదని స్పష్టంచేశారు. రూ.9 కోట్ల విలువ చేసే కుంకుమ భరిణలు పంచేందుకు ఈటల సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఈటల ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో దమ్ముంటే చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గెలుపు శ్రీనివాసే
సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించిన నాడే ఆయన గెలుపు శ్రీనివాస్‌ అయ్యాడని సుమన్‌ అభివర్ణించారు. రెండు వేల ఎకరాల భూస్వామి, వందల కోట్ల ఆస్తులున్న ఈటలపై నిఖార్సయిన విద్యార్థి ఉద్యమ నాయకుడు, బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ గెలిచిపోయారని పేర్కొన్నారు. అన్ని సర్వేలు గెల్లు గెలుపును సూచిస్తున్నాయని, ఈటల హుజూరాబాద్‌లో గ్రౌండ్‌ కోల్పోయారని చెప్పారు. ఈటల సెక్రటేరియట్‌ ఆఫీసును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కు మద్దతిచ్చారని పేర్కొన్నారు. ఈటల తెలంగాణ కోసం రక్తాన్నేమీ ధారపోయలేదన్నారు.