తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని దఫదఫాలుగా తరలిస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలపై అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని ప్రధాని మోదీ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. గురువారం రోజున అఖిల పక్ష సమావేశం జరగనున్నది. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘన్ సంగతులను చెప్పాలని మోదీ కోరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు ప్రతి రోజూ కాబూల్ నుంచి రెండు విమానాలను నడుపుతున్నారు. ఆఫ్ఘన్‌లో ఉన్న హిందువులు, సిక్కులతో పాటు స్థానికులకు కూడా హెల్ప్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆఫ్ఘన్ వివరాలను ఫ్లోర్ లీడర్లకు చెప్పాలని మోదీ చేసిన దిశానిర్దేశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతలకు ప్రధాని మోదీయే ఎందుకు ఆఫ్ఘన్ వివరాలను వెల్లడించడం లేదని ప్రశ్నించారు. జైశంకర్ చేసిన ట్వీట్‌కు ఆయన కౌంటర్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలపై మోదీకి అవగాహన లేదా అని రాహుల్ ప్రశ్నించారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా విమానాల్లో తీసుకువచ్చారు.