కేంద్ర ఎన్నికల సంఘం కచ్చితంగా పశ్చిమబెంగాల్‌లో ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జి డిమాండ్ చేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి తాము ఏమాత్రం అంగీకరించబోమని ఆమె స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్‌లో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మమత తెలిపారు. అసెంబ్లీకి, శాసనమండలికి ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ప్రజలకు ఉందని మమతాబెనర్జి చెప్పారు.
కాగా, సీనియర్ నేత దినేశ్ త్రివేది అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేసిన స్థానంలో మమత ఓడిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమత.. తన పదవిని నిలబెట్టుకోవాలంటే ఆరు నెలల్లోగా అసెంబ్లీకిగానీ, మండలికిగానీ ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమె మండలి ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
మండలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న ఉప ఎన్నిక జరుగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసీ ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసింది. కానీ, మమత మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను చట్టసభకు ఎన్నికకాకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై గేమ్ ఆడుతున్నదని ఆరోపిస్తున్నారు.