అంతర్జాతీయం ముఖ్యాంశాలు

పారాహుషార్‌

  • నేటి నుంచి పారాలింపిక్స్‌
  • భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్లు
  • సాయంత్రం4.30 నుంచి దూరదర్శన్‌లో

క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమైంది.ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత.. అదే వేదికపై పారాలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఆరంభ వేడుకలు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర ఝఝారియా, మరియప్పన్‌ తంగవేలు వంటి స్టార్‌ అథ్లెట్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంటే.. తొలిసారి ప్రవేశ పెట్టిన బ్యాడ్మింటన్‌లో పతకాలు పట్టాలని భారత షట్లర్లు ఉవ్విళ్లూరుతున్నారు.

కరోనా కష్టకాలంలో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించి శభాష్‌ అనిపించుకున్న జపాన్‌.. ఇక పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది. నాలుగేండ్లకోసారి జరిగే ఈ ప్రత్యేక క్రీడల మహోత్సవానికి మంగళవారం తెరలేవనుంది. టోక్యో ప్రధాన స్టేడియంలో ఆరంభ వేడుకలు జరుగనుండగా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్లు మెగాటోర్నీ బరిలో దిగనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 7 పతకాలు సాధించి.. విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. అదే స్ఫూర్తితో పారా అథ్లెట్లూ వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించాలని తహతహలాడుతున్నారు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర ఝఝారియా, హై జంపర్‌ మరియప్పన్‌ తంగవేలు ఈ సారి కూడా అదే జోష్‌తో సిద్ధమవుతుండగా.. కనీసం 15 పతకాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వీరిపైనే ఆశలు..
2004, 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన దేవేంద్ర ఝఝారియా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్నాడు. చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురై ఎడమ చేతిని కోల్పోయిన ఝఝారియా ఎఫ్‌46 కేటగిరీలో పోటీ పడుతున్నాడు. ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో పాటు అత్యుత్తమ రికార్డు అతడి పేరిటే ఉండటం విశేషం. ఇక గత పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన మరియప్పన్‌ తంగవేలుపై కూడా భారీగా ఆశలు ఉన్నాయి. ఐదేండ్ల వయసులో జరిగిన బస్సు ప్రమాదంలో కుడికాలిని పూర్తిగా కోల్పోయిన మరియప్పన్‌.. హైజంప్‌ టీ63 విభాగంలో పోటీపడుతున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌గా టోక్యో బరిలోకి దిగుతున్న మరియప్పన్‌.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే.. హైజంప్‌లో భారత్‌కు పతకం దక్కడం పక్కా. ఆర్చరీ, షూటింగ్‌లోనూ భారత్‌కు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్చరీలో రాకేశ్‌ కుమార్‌, శ్యామ్‌ సుందర్‌, వివేక్‌ చికార, హర్విందర్‌ సింగ్‌, జ్యోతి బలియాన్‌ బరిలో దిగనున్నారు.

పారాహుషార్‌

9 క్రీడాంశాల్లో..
1968 నుంచి పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్న భారత్‌.. ఇప్పటి వరకు 12 పతకాలు ఖాతాలో వేసుకుంది. 2016 రియో క్రీడల్లో 2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యంతో 43వ స్థానంలో నిలిచిన భారత్‌ ఈసారి టాప్‌-25లో నిలువడమే ప్రధాన లక్ష్యంగా 9 క్రీడాంశాల్లో పోటీ పడనుంది. మంగళవారం జరుగనున్న ఆరంభ వేడుకలకు భారత్‌ నుంచి ఆరుగురు అధికారులు, ఐదుగురు అథ్లెట్లు హాజరుకానున్నారు. మరియప్పన్‌ తంగవేలు పతాకధారిగా వ్యవహరించనుండగా.. వినోద్‌ కుమార్‌, టెక్‌ చంద్‌, జైదీప్‌, సకీనా ఖాతూన్‌ అతడి వెంట నడువనున్నారు. జపాన్‌ చక్రవర్తి నరుహిటో ఆటలను ప్రారంభించనుండగా.. ఇరాన్‌ తర్వాత 17వ స్థానంలో భారత బృందంపై స్టేడియంలోకి రానుంది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్‌ లాగే.. పారాలింపిక్స్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు. 205 దేశాలు, ఓ శరణార్థి జట్టు.. ఈ క్రీడల్లో భాగస్వాములు కానుండగా.. మొత్తం 11 వేల మంది అథ్లెట్లు.. 33 క్రీడలు, 339 విభాగాల్లో పోటీ పడనున్నారు. మంగళవారం ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ వచ్చే నెల 5న ముగియనుంది.

పారాహుషార్‌

తొలిసారి బ్యాడ్మింటన్‌..
టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను ప్రవేశ పెట్టనుండగా.. భారత్‌కు ఈ క్రీడల్లో పతకా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్‌ఎల్‌3 కేటగిరీలో ప్రపంచ నంబర్‌వన్‌ ప్రమోద్‌ భగత్‌తో పాటు కృష్ణ (ఎస్‌హెచ్‌6), తరుణ్‌ ఢిల్లాన్‌ (ఎస్‌ఎల్‌4) ఆశలు రేపుతుండగా.. మహిళల విభాగంలో పరుల్‌ పర్మార్‌ (ఎస్‌ఎల్‌-3), పాలక్‌ కోహ్లీ (ఎస్‌యూ-5) భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్నారు. భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో తొలి స్వర్ణంతో నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్‌లో అదే జోరు కొనసాగించేందుకు జావెలిన్‌ త్రోయర్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఎఫ్‌64 విభాగంలో ప్రపంచ చాంపియన్‌ సందీప్‌ చౌదరి పతకా ఆశలు రేపుతుండగా.. సుందర్‌సింగ్‌, అజీత్‌ (ఎఫ్‌46), నవ్‌దీప్‌ (ఎఫ్‌41) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని విభాగాల్లో వైకల్యాన్ని బట్టి క్లాసిఫికేషన్‌లుగా విభజించగా.. మహిళల టేబుల్‌ టెన్నిస్‌తో భారత అథ్లెట్లు పతకాల వేట ఆరంభించనున్నారు.

‘ఈసారి విశ్వక్రీడల్లో భారత్‌ నుంచి అతిపెద్ద బృందం బరిలోకి దిగుతున్నది. అందుకు తగ్గట్లే పతకాలు కూడా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాం. చరిత్ర తిరుగరాసేందుకు అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల గత రెండేండ్లలో ప్రపంచం ఎన్నో విపత్కర పరిస్థితులను చూసింది. వాటన్నింటినీ దాటుకుంటూ అథ్లెట్లు సత్తాచాటేందుకు రెడీ అయ్యారు. ఎక్కువ క్రీడాంశాల్లో పోటీ పడుతుండటంతో పతకాల సంఖ్య కూడా పెరుగుతుందని కచ్చితంగా చెప్పగలను’

  • దీపా మాలిక్‌, భారత పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌