మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపపై కొట్టి ఉండేవాడినంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే సందర్భాల్లో పాటించాల్సిన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. ‘ప్రోటోకాల్ ప్రకారం, భారత రాష్ట్రపతి ర్యాంక్‌లో నంబర్ వన్. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత ప్రధాని. ర్యాంకింగ్ కేటగిరి 7 (ఏ)లో జూనియర్ యూనియన్ క్యాబినెట్ మంత్రి తర్వాతే ఏడు(బీ)లో ముఖ్యమంత్రి వస్తారు’ అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే విధానం ఏమిటి?
ఈ నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే విధానం ఏమిటన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఒక కేంద్ర మంత్రి లేదా పార్లమెంటు సభ్యుడు కొన్ని అధికారాలు పొందుతారు. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వారికి ఎక్కువ అధికారాలు ఉంటాయి.
పార్లమెంట్ సమావేశాలు జరుగని పక్షంలో పోలీసులు లేదా ఇతర చట్ట సంస్థలు క్రిమినల్ కేసులో కేంద్ర క్యాబినెట్ మంత్రిని అరెస్టు చేయవచ్చు. ప్రస్తుతం నారాయణ్ రాణే అరెస్ట్ విషయంలో రాజ్యసభ ఛైర్మన్, అంటే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు మాత్రమే తెలియజేయడం అవసరం.
రాజ్యసభ నియమాలు, ప్రవర్తన నిబంధనల సెక్షన్ 22ఏ ప్రకారం, అరెస్ట్ ఆర్డర్ జారీ చేసే న్యాయమూర్తి లేదా పోలీసులు అరెస్ట్‌కు కారణం, అరెస్ట్ చేసే ప్రదేశం గురించి రాజ్యసభ ఛైర్మన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఛైర్మన్ దానిని రాజ్యసభ బులెటిన్‌లో ప్రచురిస్తారు.
అరెస్ట్ నుంచి కేంద్ర మంత్రికి రక్షణ ఉంటుందా?
ముఖ్యంగా సివిల్ కేసులలో అరెస్ట్ నుంచి కేంద్ర మంత్రి లేదా ఎంపీకి రక్షణ ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి 40 రోజుల ముందు, సమావేశాల సమయంలో, ముగిసిన 40 రోజుల తర్వాత కేంద్ర మంత్రి లేదా ఎంపీ అరెస్టు నుండి రక్షణ పొందుతారు.
ఈ నేపథ్యంలో, సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం, ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడంతో సివిల్ కేసులో అరెస్ట్ నుంచి నారాయణ రాణేకు రక్షణ ఉంటుంది. అయితే క్రిమినల్ కేసులో అరెస్ట్ లేదా నిర్బంధం నుంచి ఎలాంటి రక్షణ ఉండదు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి నారాయణ రాణేపై ముఖ్యమంత్రిని బెదిరించడం, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, 20 ఏండ్ల తర్వాత తొలిసారి ఒక కేంద్ర మంత్రి అరెస్ట్ అయ్యారు.