కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితులు, థర్డ్ వేవ్‌పై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, కేబినెట్ సెక్రెటరీ, నీతి ఆయోగ్ సభ్యులు సైతం సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్‌లో థర్డ్ వేవ్‌కు అవకాశం ఉందని, కరోనా కేసులు తారాస్థాయికి చేరుకుంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ తన నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది. కమిటీ నివేదికలో అక్టోబర్‌లో థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది.
కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. చిన్నారుల వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించింది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని ఈ నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కోసం ఏర్పాటు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని ఎన్ఐడీఎం నిపుణులు సూచించారు. దేశంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉందని.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ ఖాళీల భర్తీ చేయాలని సూచించింది. ఈ క్రమంలో ప్రధాని భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.