రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. ఆ 45 నిమిషాల్లో వారు పూర్తిగా ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల గురించే చర్చించుకున్నారు. ప్రధాని కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఓ పది రోజుల క్రితం తాలిబన్‌లు టేకోవర్ చేయడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా నేతలంతా దేశం విడిచి పారిపోయారు.
దాంతో అఫ్ఘాన్‌లో తాలిబన్‌లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. అంతా ఊహించినట్టుగానే తాలిబన్‌లు మహిళపైనా, గత ప్రభుత్వ మద్దతుదారులపైనా దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులు స్వదేశాలకు తరలిస్తున్నాయి. భారత్ ఆపరేషన్ దేవి శక్తి పేరుతో ఆఫ్ఘన్ నుంచి భారతీయులను తీసుకొస్తున్నది. ఈ క్రమంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడితో 45 నిమిషాలు మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకున్నది.