ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీష్ ధామి, మనోజ్ రావత్ ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ధార్చులలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని, చార్ ధామ్ యాత్రను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన సీఎం పుష్కర్ సింగ్ ధామి వారి విన్నపాలను స్వీకరించారు.
మరోవైపు చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా అర్చకులు నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనిపై స్పందించారు. అర్చకుల హక్కులను దేవస్థానం బోర్డు హరించకుండా చూస్తామన్నారు.
అందరి అభిప్రాయాలను ప్రభుత్వం వింటుందని, సమస్యలను పరిష్కరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని, చర్యల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. అన్ని సందేహాలు తీరుస్తామని, అవసరమైతే ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డు చట్టానికి సవరణలు చేస్తామని తనని కలిసిన అర్చక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.