తెలంగాణ ముఖ్యాంశాలు

మ‌రో మూడు రోజులు తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

 రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ములుగు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో వర్షం కురిసినట్లు తెలిపింది. కాగా మేడ్చల్‌- మల్కాజిగిరి, హైదరాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌లో 9, సీతాఫల్‌మండి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పికెట్‌, జోగులాంబ-గద్వాల జిల్లా ఐజ లలో 7, సిద్దిపేట జిల్లా కోహెడలో 8 సెంటీ మీటర్ల వర్షపాతం న‌మోదైన‌ట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.