తెలంగాణ

Development Funds : ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.2.50 కోట్లు.. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన మేరకు మొదటి రెండు త్రైమాసికాలకు (ఆరునెలలు) కలిపి రూ. 382.50 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ప్రణాళికా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి రూ.2.50 కోట్లు చేరనున్నాయి. జిల్లా కలెక్టర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను స్వీకరించాలని, పరిశీలించిన అనంతరం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ రూ.382 కోట్లలో రూ.59 కోట్లు ఎస్సీ నియోకవర్గాలకు, రూ.34.73 కోట్లు ఎస్టీ నియోజకవర్గాలకు చేరనున్నాయి. నూతనంగా ఏర్పడిన నారాయణపేట, ములుగు జిల్లాలకు సంబంధించిన నిధులను మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్ల ఖాతాలకు బదిలీ చేశారు.