- సీఎం ఉద్ధవ్‌పై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఉద్ధవ్‌ను చెంప పగులగొట్టేవాడినన్న రాణే
- ఆజాదీ సంవత్సరాన్ని మర్చిపోయారని విమర్శ
- రాణేను అదుపులోకి తీసుకున్న ‘మహా’ పోలీసులు
- రాత్రి కోర్టులో హాజరు… బెయిల్ మంజూరు
- రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తల నిరసనలు
- ‘చికెన్ దొంగ రాణే’ అంటూ ముంబైలో పోస్టర్లు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం తెలియని ఉద్ధవ్‌ను తానైతే చెంప పగులగొట్టేవాడినని రాణే వ్యాఖ్యానించారు. రాణే వ్యాఖ్యలపై భగ్గుమన్న శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో ఉన్న రాణేను పోలీసులు కస్టడీలోకి తీసుకుని సంగమేశ్వర్ ఠాణాకు తరలించారు. నాసిక్ శివసేన అధ్యక్షుడు ఫిర్యాదుతో రాణేపై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 505(2) (దుశ్చేష్ట), 153-బీ(1)(సీ) (ద్వేషపూరిత వ్యాఖ్యలు) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాణేను వెంటనే అరెస్టు చేయాలని నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు ప్రక్రియ ప్రారంభమయ్యాక తనకు బీపీ, షుగర్ పెరిగిపోయాయని రాణే ఆందోళన వ్యక్తం చేయడంతో వైద్య పరీక్షలు చేయించారు. మగళవారం రాత్రి రాయగఢ్ జిల్లా మహడ్‌లోని కోర్టులో రాణేను పోలీసులు హాజరుపర్చారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
రాణే ఏమన్నారు?
‘దేశానికి స్వాతంత్య్రం ఏ సంవత్సరంలో వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపి వెనుక ఉన్నవారిని అడగాల్సి వచ్చింది. నేను అక్కడ ఉండి ఉంటే (ఆయన) చెంప పగులగొట్టేవాడిని’ అని రాణే వ్యాఖ్యానించారు. సోమవారం రాయగఢ్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరాన్ని ఉద్ధవ్ మర్చిపోయారని, తన వెనుక ఉన్న అనుచరులను అడిగి తెలుసుకున్నారని రాణే విమర్శ.
నేను సాధారణ వ్యక్తిని కాదు: రాణే
పోలీసులు మరికొన్ని గంటల్లో తనను అరెస్టు చేస్తారనగా మీడియాను రాణే హెచ్చరించారు. తాను సాధారణ వ్యక్తిని కాదని, తన అరెస్టు గురించి వార్తలు రాయద్దని చెప్పారు. తానేమీ నేరం చేయకపోయినా తన అరెస్టు గురించి మీడియా ఊహాగానాలను ప్రసారం చేస్తున్నదని మండిపడ్డారు. రాణే వ్యాఖ్యలను సమర్థించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ తెలిపారు. అయితే ఆయనకు పార్టీ అండగా ఉంటుందని ఫడ్నవీస్ తెలిపారు.
బీజేపీ, శివసేన కార్యకర్తల ఘర్షణ
రాణే వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ముంబైలో రాణేను ‘చికెన్ దొంగ’ అంటూ పోస్టర్లు అతికించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 50 ఏండ్ల కిందట రాణే ఓ పౌల్ట్రీ షాపును నడిపారు. ఆ రోజులను గుర్తుచేస్తూ శివసేన పోస్టర్లు వేసింది. 1999లో మహారాష్ట్ర సీఎంగా కూడా పనిచేసిన రాణే… బాల్ ఠాక్రే నాయకత్వంలో చాలాకాలం శివసేనలో ఉన్నారు. ముంబైలోని రాణే ఇంటిని శివసేన కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా వారికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. అమరావతిలో బీజేపీ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.
బాంబే హైకోర్టులో చుక్కెదురు
మహారాష్ట్రలో పలుచోట్ల తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాల్ చేస్తూ రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే విచారణ చేపట్టడానికి కోర్టు నిరాకరించింది. అత్యవసర విచారణ కోసం పద్ధతి ప్రకారం రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రాజ్యాంగ విలువల ఉల్లంఘన: నడ్డా
రాణేను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అరెస్టుపై ప్రజాస్వామికంగా పోరాడుతామని చెప్పారు.
కేంద్ర మంత్రిని అరెస్టు చేయాలంటే..
అరెస్ట్ విషయంలో కేంద్ర మంత్రులకు, ఎంపీలకు పలు మినహాయింపులు ఉంటాయి. ఇవి చాలావరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే వర్తిస్తాయి. సమావేశాలు లేనప్పుడు క్రిమినల్ కేసుల్లో కేంద్ర మంత్రులను, ఎంపీలను అరెస్ట్ చేయొచ్చు. అయితే ముందుగా సభాపతికి సమాచారం ఇవ్వాలి. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, ముగిసిన 40 రోజుల వరకు కేంద్రమంత్రులను, ఎంపీలను అరెస్ట్ చేసేందుకు వీలులేదు. రాణేపై నమోదైనది క్రిమినల్ కేసు. దీంతో ఆయన ఈ రక్షణలు వర్తించవు.
20 ఏండ్లలో ఇదే తొలిసారి
గత 20 ఏండ్లలో ఒక రాష్ట్ర పోలీసులు కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. 69 ఏండ్ల రాణే… శివసేనలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రేకు నమ్మకస్తుడిగా మెలిగారు. తర్వాత ఠాక్రేలతో విభేదాలతో 2005లో రాణేను బహిష్కరించారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు. జూలైలో కేంద్ర క్యాబినెట్‌లో చోటు లభించింది.