జాతీయం ముఖ్యాంశాలు

8 నుంచి దేశవ్యాప్త నిరసన

  • కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్‌ అనుబంధ బీకేఎస్‌ ప్రకటన
  • డిమాండ్ల పరిష్కారానికి మోదీసర్కారుకు ఈ నెల 31 డెడ్‌లైన్‌

కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్‌ అనుబంధ భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) కూడా స్వరంపెంచింది. పంట వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస మద్దతు ధరను ప్రకటించాలని, రైతులు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన చట్టాన్ని తీసుకురావాలని మోదీ సర్కారును డిమాండ్‌ చేసింది. కేంద్రానికి ఈ నెల 31 వరకు సమయమిస్తున్నారని, అప్పటికీ డిమాండ్లు పరిష్కరించకపోతే వచ్చే నెల 8 నుంచి దేశవ్యాప్తంగా నిరసన చేపడుతామని హెచ్చరించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఆరెస్సెస్‌ నడపడం లేదని బీకేఎస్‌ కోశాధికారి యుగల్‌ కిషోర్‌ మిశ్రా యుగల్‌ కిషోర్‌ మిశ్రా తెలిపారు. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రమేకాదు కొన్ని రాష్ర్టాలు కూడా పనిచేయడం లేదని విమర్శించారు. నాడు వాజపేయి ప్రభుత్వంలో, నేడు మోదీ పాలనలో రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకొని లాభదాయకమైన ధరను నిర్ణయించడంలో ఇప్పుడు ఉన్న మోదీ సర్కార్‌, అప్పటి వాజపేయి సర్కార్‌ విఫలమైందని విమర్శించారు.