తెలంగాణ

నీటివాటాలపై బలంగా వాదించండి

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన నీటి వాటాకోసం కేఆర్‌ఎంబీ, ట్రిబ్యునల్స్‌ సహా అన్ని రకాల వేదికలపై బలమైన వాదనలు విన్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇరిగేషన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్‌ 1న జరిగే బోర్డు మీటింగ్‌కు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండా అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాకు సంబంధించి అంశాలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై సాగునీటిశాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, రిటైర్డ్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.