తాలిబన్ల భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వందలాది మందిని టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లకు పాల్పడింది ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ( ISIS-Khorasan ). దీన్నే ఐఎస్-కే అని కూడా పిలుస్తారు. ఐఎస్ ఖొరోసన్ ప్రాంతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర దళం. తాజా పేలుళ్లలో సుమారు 90 మంది మరణించడానికి వీళ్లే కారణం. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఐఎస్-కే నిన్న జరిపిన బీభత్సం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. 2011 నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఒకే రోజు అమెరికా దళాలు అత్యధిక సంఖ్యలో తమ సైనికుల్ని కోల్పోయాయి. గురువారం జరిగిన పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. తాలిబన్లు అధిక సంఖ్యలో ఉన్నా.. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ లో ఆల్‌ఖయిదా, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు బలపడే సూచనలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఐఎస్ఐఎస్- ఖొరోసన్ అంటే ఏమిటి ?
2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ కలిఫా ప్రకటించిన కొన్ని నెలల్లోనే.. పాకిస్థానీ తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులతో చేతులు కలిపారు. వాళ్లంతా కలిసి ప్రాంతీయ దళంగా ఏర్పడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ బాకర్ అల్ బాగ్దాది ఆదేశల మేరకే వాళ్లు పనిచేస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని ఈశాన్య ప్రాంతాలైన కునార్, నాన్‌గర్‌హర్, నురిస్తాన్ ప్రావిన్సుల్లో ఖరోసన్ గ్రూపు పట్టు సాధించింది. దీంతో ఆ గ్రూపుకు ఐఎస్ఐఎస్ కేంద్ర నాయకత్వానికి దగ్గరైంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఐఎస్-ఖరోసన్ గ్రూపు తనకు చెందిన స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసింది. కాబూల్‌లో కూడా ఆ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఐఎస్-ఖరోసన్ గ్యాంగ్‌లో వేలాది మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. యూఎన్ భద్రతా మండలి నివేదికలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక పేరే ఖరోసన్. ప్రస్తుతం ఉన్న పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా ఆ ప్రాంతం కిందకు వస్తాయి.
దాడులు ఎలా చేస్తారు ?
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్‌లోని ఐఎస్ఐఎస్ గ్రూపు ఇటీవల కాలంలో భీకరమైన దాడులకు పాల్పడింది. రెండు దేశాల్లోనూ ఖరోసన్ గ్రూపు వందలాది మందిని హతమార్చింది. మసీదులు, పవిత్ర స్థలాలు, పబ్లిక్ ప్లేస్‌లు, హాస్పిటళ్లను వాళ్లు టార్గెట్ చేస్తూ పేలుళ్లు నిర్వహించారు. ఈ గ్రూపు ఎక్కువగా ముస్లింలను టార్గెట్ చేసింది. మతపరమైన చట్టాలను గౌరవించనివారిని హతమార్చింది. ఆ జాబితాల్లో షియా ముస్లింలు కూడా ఉన్ఆనరు. గత ఏడాది కాబూల్‌లో ఓ మెటర్నటీ హాస్పిటల్‌లోకి వెళ్లి 16 మంది తల్లులను చంపేసింది వీళ్లే. బాంబు దాడులు, కాల్చివేత ఘటనలతో ఐఎస్-ఖరోసన్ బీభత్సం సృష్టించినా.. ఆ గ్రూపు మాత్రం ఏ ఒక్క ప్రాంతాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోలేదు. తాలిబన్లు, అమెరికా దళాల వల్ల వాళ్లు చాలా నష్టపోయారు. ప్రస్తుతం కోవర్టు సెల్స్ ద్వారా నగరాల్లో దాడులకు పాల్పడుతున్నారు.
తాలిబన్లతో ఐఎస్-ఖొరోసన్‌తో లింకేంటి ?
రెండు గ్రూపులు సున్నీ వర్గానికి చెందినవే. మతం, వ్యూహంపై ఇద్దరిలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. జిహాదీ సిద్ధాంతానికి తామే మూలం అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య రక్తపాతం సాగింది. ఆ సమరంలో తాలిబన్లు ఎక్కువ శాతం విజేతలుగా ఆవిర్భవించారు. ఐఎస్-ఖొరోసన్ ఏ ఒక్క ప్రాంతాన్ని చేజిక్కించుకోకపోవడంతో వాళ్లు ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. అయితే తాలిబన్లను ఐఎస్ భిన్నంగా గుర్తించింది. తాలిబన్లకు మతవిశ్వాసాలు లేవని ఇస్లామిక్ స్టేట్ సంస్థ భావిస్తుంది.
తాలిబన్ల విజయంపై ఐఎస్ రియాక్షన్ ఏంటి ?
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడం పట్ల ఇస్లామిక్ స్టేట్ విముఖంగానే ఉంది. అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఐఎస్ఐఎస్ వ్యతిరేకించింది. జిహాదీ సిద్ధాంతాలను తాలిబన్లు కాలరాసినట్లు ఐఎస్ ఫేర్కొన్నది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదీ గ్రూపులు తాలిబన్లను మెచ్చుకున్నా.. ఐఎస్ఐఎస్ మాత్రం ఇప్పటి వరకు కంగ్రాట్స్ చెప్పలేదు.
కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏం జరిగింది ?
విమానాశ్రయంలోకి ఎంటర్ అవుదామనుకున్న అబ్బే గేట్ వద్ద తొలి పేలుడు జరిగింది. అక్కడే అమెరికా బలగాలు పహారా కాస్తున్నాయి. మరికొన్ని క్షణాల వ్యవధిలో కొన్ని వందల మీటర్ల దూరంలో హోటల్‌లో బాంబే పేలింది. ఆ రెండు ఘటనల్లో 90 మంది మరణించారు.