ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాదాపు ఐదు వారాల తర్వాత రష్యా దాడులు చేసింది. తూర్పు కీవ్ శివారు ప్రాంతాల్లోని పలు చోట్ల ఆదివారం ఉదయం బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఐరోపా దేశాలకు ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన టీ-72 ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. అయితే దీన్ని ఉక్రెయిన్ అధికారి ఒకరు ఖండించారు. దాడుల్లో ఒకరికి గాయాలయ్యాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్షో తెలిపారు. కొద్ది రోజులుగా సాధారణ జనజీవనం నెలకొన్న కీవ్‌లో తాజా దాడులతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
మరోవైపు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయడం కొనసాగితే దాడులను మరింత పెంచుతామని, ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలపై దాడులు చేస్తామని కీవ్‌లో తాజా దాడులకు కొన్ని గంటల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు 70 కోట్ల డాలర్ల భద్రతాపరమైన సాయం చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం. మరోవైపు డాన్‌బాస్ రీజియన్‌లోని సీవీరోడోనెట్స్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ నగరంలో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు.