వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పార్టీ కార్యకర్త విజయరాజు తీవ్రంగా గాయపడగా పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రం చినగంజాం పంచాయతీ మహాలక్ష్మి కాలనీలో గురువారం జరిగింది. వివరాలు.. కాలనీలో ఆరేళ్లుగా పలువురు ఎస్సీలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.
అదే కాలనీలో నివాసం ఉండే టీడీపీ నాయకురాలు చేవూరి రమణమ్మ ఆ స్థలాలన్నీ తన ఆధీనంలో ఉన్నాయని, తనకు రూ. 5 వేలు చొప్పున ఇచ్చి నివాస గృహాలు వేసుకోవాలంటూ వారిపై దౌర్జ్జన్యానికి పాల్పడటమే కాకుండా డబ్బులు కట్టని వారి గుడిసెలు పీకి తగలబెడతానంటూ కొంతకాలంగా బెదిరిస్తోంది. ఈ క్రమంలో చేవూరి రమణమ్మ తన మనుషులతో ఎస్సీల గృహాల వద్దకు వచ్చి పరుష పదజాలంతో బూతులు తిడుతోంది.
ఆమె వెంట వచ్చిన మానికల ప్రసాద్, ఏసుబాబులు లింగగుంట యశోధ అనే ఎస్సీ మహిళ జుత్తు పట్టుకొని దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెను రక్షించేందుకు వచ్చిన మేకల కమలమ్మను రమణమ్మ, ఆమె చెల్లెలు సామ్రాజ్యం, అంజమ్మలు కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మరో మహిళ పీకా రమాదేవిని సైతం రమణమ్మ కుమార్తె ప్రభావతి, మనుమరాలు ఎస్తేరు రాణి తీవ్రంగా కొట్టి గాయపరిచారు.
తన భార్య, బంధువులను అన్యాయంగా కొడుతున్నారంటూ అడ్డుకోబోయిన యశోధ భర్త లింగంగుంట విజయరాజును ప్రసాద్, ఏసుబాబులు కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో చీరాల వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. చీరాల ఔట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుల ఫిర్యాదు నమోదు చేసుకొని చినగంజాం పోలీసుస్టేషన్‌కు కేసు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ అంకమ్మరావు తెలిపారు.