కాస్ట్ టు కాస్ట్ సేల్ విధానంలో అమలు
15 నుంచి 20 రోజుల్లో భక్తులకు అందుబాటులోకి
శ్రీవారి భక్తులకు ఉచిత భోజన సదుపాయంతోపాటు సంప్రదాయ భోజనాన్ని కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో షడ్రుచులతో కూడిన భోజన వసతి కల్పించనుంది. ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ (ఎంత ఖర్చు అయితే అంత) సేల్ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్‌లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్నమయ్య భవన్‌లో కొందరికి సంప్రదాయ భోజనం
గో ఆధారిత భోజనం ఇలా
► అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు.
► దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు.
► కాలాబాత్ బియ్యంతో ఉప్మా, కులంకార్ బియ్యంతో ఇడ్లీలు తయారు చేశారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
► సెప్టెంబర్ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు.