తెలంగాణ

దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.

సమైక్య రాష్ట్రంలో విధ్వంసానికి గురైన వ్యవసాయరంగానికి పూర్వవైభవం తీసుకొచ్చి, తెలంగాణను దేశ భాండాగారంగా మలచిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఉద్యమ సమయంలో వెకిలి మాటలు మాట్లాడిన వారంతా ఆశ్చర్యపోయేలా సుభిక్షమైన పాలన సాగిస్తూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్నారు. నేడు తెలంగాణలో ఆకలి అన్నదే లేదని, ఆత్మహత్యలు లేని తెలంగాణ మన కళ్ల ముందు సాక్షాత్కారం అయ్యిందని జగదీష్‌రెడ్డి అన్నారు.

యాత్రలెవరిపైనో చెప్పాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై మంత్రి నిరంజన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సస్యశ్యామలమైన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని ఆరోపించారు. వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ‘సంగ్రామం ఎవరి మీదో చెప్పాలి. సంతోషంగా ఉన్న రైతుల మీదనా.. ప్రజల మీదనా చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

భయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, విభజనచట్టంలోని అంశాలను నెరవేర్చేలా కేంద్రంపై సంగ్రామం చేయాలని బండి సంజయ్‌కి సూచించారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఇక సిగ్గు, శరం లేని తెలంగాణ ద్రోహి చంద్రబాబు, తెలంగాణలో ప్రజలకు ముఖం చూపెట్టలేక ఆయన తొత్తు అయిన రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి నిరోధుకులైన కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణ ప్రజలు మళ్లీ నానా అవస్థలు పడే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ లింగయ్య యాదవ్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.