తెలంగాణ ముఖ్యాంశాలు

దళితులను వెలేసిన బీజేపీ సర్పంచ్‌

  • వంతపాడిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు
  • పోలీసులకు దూస్‌గాం దళితుల ఫిర్యాదు
  • అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి

డప్పు కొట్టేందుకు ఎక్కువ డబ్బులు అడిగారన్న కోపంతో 70 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశాడో బీజేపీ సర్పంచ్‌. ఈ దుశ్చర్యను నిలువరించి దళితులకు అండగా నిలువాల్సిన గ్రామఅభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు సైతం సర్పంచ్‌కే వంతపాడారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం దూస్‌గాం గ్రామంలో ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. కాగా, దళితులు గురువారం పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆర్డీవో రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఆర్డీవో, ఏసీపీ దళిత వాడను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలకు డప్పులు కొట్టేందుకు కొంత డబ్బులు ఎక్కువ అడిగినందుకు.. పక్క ఊరి వాళ్లను పిలుచుకుని డప్పులు కొట్టించుకున్నారని దళితులు ఆరోపించారు. కొన్నిరోజుల నుంచి తమను ఎలాంటి శుభకార్యాలకు పిలువడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాలనీల్లో డ్రైనేజీలు లేవని, తాగునీరు, విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని కోరినా బీజేపీ సర్పంచ్‌ శివారెడ్డి పట్టించుకోవట్లేదని వాపోయారు. ఊరిలో ఏ కార్యమైనా తమతోనే డప్పులు కొట్టించుకోవాలని.. చాకలివారికి పెంచిన విధంగా తమకూ రూ.500 పెంచాలని కోరా రు. అనంతరం ఏసీపీ, ఆర్డీవోలు మాట్లాడుతూ.. సాంఘిక బహిష్కరణ చట్టరీత్యా నేరమని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బహిష్కరణ శోచనీయం: వంగపల్లి

డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు 70 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన దూస్‌గాం సర్పంచ్‌, వీడీసీ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దళితులపై అగ్రవర్ణాలు దాడులు, అవమానకర చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. పైగా ఉపాధిహామీలో పని చేస్తున్న దళితులు సాయి, లక్ష్మి, తోట గంగారాంను పనులు నుంచి తొలగించడం దారుణమని చెప్పారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు.