- ఈ ఏడాది నుంచే కొత్త కోర్సు
- 4 కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభం
- కోర్సు రూపకల్పనలో రెడ్డీస్ ల్యాబ్స్ సహకారం
ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సు ఫార్మసీ. బీ ఫార్మసీతోపాటు ఫార్మా-డీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్ పూర్తిచేసిన వారికి ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇంటర్ స్థాయిలో కూడా ఫార్మసీ కోర్సును ఇంటర్ విద్యా మండలి ప్రవేశపెట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ‘ఫార్మా టెక్నాలజీ’ పేరుతో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభిస్తున్నారు. ఇది పూర్తిగా వోకేషనల్ కోర్సు. దీనిని హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ వోకేషనల్ కాలేజీ, సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నల్లగొండ, భువనగిరిలోని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈ కోర్సు రూపకల్పనలో సహకారం అందించింది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి రెడ్డీస్ ల్యాబ్స్‌లోనే అప్రెంటిస్‌షిప్‌తోపాటు ఉద్యోగం కూడా ఇస్తారు.