జాతీయం ముఖ్యాంశాలు

నాదీ తెలుగు మాధ్యమమే

  • డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నా
  • తెలుగుమీడియం దండగనే అపోహ పోవాలి
  • అమ్మభాషకు ఎన్నడూ లేనంత ముప్పు
  • రక్షణకు ఉద్యమ స్థాయిలో పూనుకోవాలి
  • శాసించే శక్తిగా తెలుగు సమాజం ఎదగాలి
  • సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత ముప్పు పొంచి ఉన్నదని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ హెచ్చరించారు. తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్థాయిలో భాషాభిమానులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు మాధ్యమంలో చదువడం దండగ అనే అపోహను తొలగించాలన్నారు. తాను డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నానని చెప్పారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సభలో జస్టిస్‌ రమణ ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలుచుకుంటూ ప్రపంచ భాషల్లోని మంచిని సమ్మిళితం చేసుకుంటూ తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీతో, ఆర్థిక సంస్కరణలతో కొత్తగా ప్రవేశించే పదజాలాన్ని బలవంతంగా గ్రాంథిక భాషలో బంధించే ప్రయత్నం చేయకూడదని చెప్పారు. అలాంటి ప్రయత్నాలు యువతరంలో భాషపై విముఖత పెంచుతాయని అన్నారు. తెలుగు భాషను ప్రోత్సహించడానికి ప్రవాసు లు చేస్తున్న కృషిని అభినందించారు.

పొన్నవరం దాటేవాడిని కాదేమో!
‘డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంగ్లిష్‌ అభ్యాసం 8వ తరగతిలో ఆరంభమైంది. పల్లెటూళ్లో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువు నేర్చుకుని నేను ఈ స్థాయికి చేరుకున్నాన’ని జస్టిస్‌ రమణ చెప్పారు. పాఠ్య పుస్తకాలు, విద్యా బోధన వ్యావహరికంలో సాగడం నాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. గ్రాంథికం కొనసాగి ఉంటే బహుశా నేను జీవితంలో ఎప్పుడూ స్వగ్రామం పొన్నవరం దాటి ఉండేవాడిని కాదేమోనని అన్నారు. ‘మనుషులంతా ఆలోచించేది మాతృభాషలోనే. ఆ మాతృ భాషలోనే విద్యాబోధన సాగితే కలిగే ప్రయోజనాలెన్నో. పోటీకి తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్లాన్ని విస్మరించలేం. అలాగని, ఆంగ్లం కోసం తెలుగుని త్యజించనక్కరలేద’ని చెప్పారు.

మార్పు రాకపోతే…
తాజా జనాభా లెక్కల ప్రకారం నేడు భారతదేశంలో 8.10 కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారని జస్టిస్‌ రమణ తెలిపారు. తెలుగు మాట్లాడేవారు సంఖ్యాపరంగా చూస్తే దేశంలో 3వ స్థానంలోను, ప్రపంచంలో 13వ స్థానంలోనూ ఉన్నారని చెప్పారు. ‘ఏ సమాజంలోనైనా భాష, సంస్కృతి ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. సమాజం మార్పు కోరుతున్నప్పుడు తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికీ తిప్పలు తప్పవు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష, ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయ’ని చెప్పారు. చైతన్యవంతమైన తెలుగు సమాజం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు భాషలో దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకుంటూ మనుగడ కొనసాగించగలుగుతోందన్నారు.

తెలుగు సినిమా అర్థం కావాలంటే…
అద్భుతమైన సాహిత్యంతో తెలుగును సుసంపన్నం చేసిన సినిమా రంగంలో కూడా తెలుగు పరిస్థితి దయనీయంగా మారిందని జస్టిస్‌ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లిషులో సబ్‌ టైటిల్స్‌ చూడాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. తెలుగు కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందన్నారు. వార్తాపత్రికలు నేటికీ భాషకు తగిన ప్రాధాన్యమిస్తూ తెలుగును నిలబెడుతున్నాయని అభినందించారు.

జపాన్‌, చైనాలో ..
జపాన్‌, చైనా పరాయిభాషల మోజులో పడలేదని, తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని జస్టిస్‌ రమణ చెప్పారు. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయటివారిని సైతం వారి భాషలను నేర్చుకునేలా పురికొల్పుతున్నాయని అన్నారు. ‘మన భాషే బలంగా, తెలుగు సమాజం కూడా శాసించే శక్తిగా ఎదగాలన్నది నా ఆకాంక్ష. అందుకు ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాల’ని చెప్పారు.