జాతీయం ముఖ్యాంశాలు

Coronavirus | ఆ పాము విషంతో క‌రోనాకు చెక్ !

అత్యంత విష స‌ర్ప‌మే.. కోవిడ్‌19 నివార‌ణ‌లో కీల‌కం కానున్న‌ది. బ్రెజిల్ అడ‌వుల్లో క‌నిపించే స‌ర్పం జ‌రారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయ‌వ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌న నివేదిక‌ను సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్ర‌చురించారు. ర‌క్త‌పింజ‌ర జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం క‌రోనా వైర‌స్ క‌ణాల వృద్ధిని నియంత్రిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారుతున్న కోవిడ్ వ్యాధి నివార‌ణ‌లో వైప‌ర్ స్నేక్ జ‌రారాకుసో విషంలో ఉన్న అణువులు కీల‌కం కానున్న‌ట్లు భావిస్తున్నారు. సావో పౌలో యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాఫేల్ గైడో దీనికి సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చారు.

వైర‌స్‌లో రెట్టింపు అవుతున్న ముఖ్య‌మైన ప్రోటీన్‌ను అడ్డుకోవ‌డంలో జ‌రారాకుసో స‌ర్పంలో ఉన్న అణువులు ప‌నిచేస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. బ్రెజిల్‌లో క‌నిపించే అతిపెద్ద స‌ర్పంగా జ‌రారాకుసోకు గుర్తింపు ఉన్న‌ది. ఆ పాములు సుమారు రెండు మీట‌ర్ల పొడుగు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడ‌వుల‌తో పాటు బొలివియా, ప‌రాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ స‌ర్పాలు సంచ‌రిస్తుంటాయి. ఆ స‌ర్పాల్లో ఉండే పెప్‌టైడ్ అణువుల‌ను ల్యాబ్‌ల్లోనూ అభివృద్ధి చేయ‌వ‌చ్చు అని రాఫేల్ గైడో తెలిపారు. ప్ర‌స్తుతం శాస్త్ర‌వేత్త‌లు ఇంకా అధ్య‌య‌న ద‌శ‌లోనే ఉన్నారు.