నాటో మౌనం దాడులకు పురిగొల్పడమేనని ఆగ్రహం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మరోసారి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై మండిపడ్డారు. రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రాకుండా ‘నో ఫ్లై జోన్’ విధించాలన్న విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో మౌనం.. ఉక్రెయిన్ పై రష్యా మరిన్ని వైమానిక దాడులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేనని అన్నారు.
‘‘ఇవాళ నాటో సదస్సు జరిగింది. అదో బలహీనమైన గందరగోళమైన సదస్సు. యూరప్ స్వేచ్ఛ కోసమే మేం పోరాడుతున్నామన్న విషయాన్ని ఏ ఒక్కరూ గుర్తించలేని సదస్సు’’ అని ఆయన పేర్కొన్నారు. నో ఫ్లై జోన్ ను విధించకుండా ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై మరిన్ని దాడులకు రష్యా పురిగొల్పేలా నాటో కూటమి ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే, ఉక్రెయిన్ పై దాడులను నిరోధించేందుకు నో ఫ్లై జోన్ ను విధించాలంటూ కొన్నాళ్లుగా అమెరికా, నాటో సభ్య దేశాలను జెలెన్ స్కీ కోరుతున్నారు. అది జరిగే పని కాదని గతంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పారు. తాజాగా నిన్న నాటో చీఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.