జాతీయం

పెట్రోల్‌పై 15 పైసలు కోత.. సిలిండర్‌పై రూ.25 వాత

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్‌ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్‌ ధరను రూ.75 పెంచాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.912కు చేరింది.

కాగా, గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొద్దిగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 15 పైసలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.49కి, డీజిల్‌ ధర రూ.88.92కి తగ్గాయి. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.107.39, డీజిల్‌ 96.33, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.08, డీజిల్‌ రూ.93.38, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.101.72, డీజిల్‌ రూ.91.84కు తగ్గాయి. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.40, డీజిల్‌ రూ.96.84కు చేరింది.