పారా షట్లర్‌లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రమోద్ భగత్ బ్రిటన్ షట్లర్ డేనియల్ బెతెల్‌ను రెండు వరుస సెట్లలో మట్టికరిపించి స్వర్ణం సాధించాడు. మరో షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జపాన్ షట్లర్ దైసుకే ఫుజిహరాను ఓడించి కాంస్యం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వాళ్లిద్దరినీ అభినందించారు.
ప్రమోద్ భగత్ తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశ ప్రజల హృదయాలను దోచుకున్నాడని ప్రధాని ప్రశంసించారు. అతనొక చాంపియన్ అని, అతని విజయం కొన్ని లక్షల మందికి ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. మనోజ్ సర్కార్ తన చక్కని ఆటతీరుతో భారత్‌కు కాంస్య పతకం తీసుకొస్తున్నాడని ప్రధాని పొగిడారు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.