ఆంధ్రప్రదేశ్

కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలను ఆదుకున్నాం: మంత్రి బుగ్గన

టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గినా, మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,130.19 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని తెలిపారు.

పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నాం తప్ప పరిమితికి మించి కాదని చెప్పారు. చదువే పిల్లలకి అతి పెద్ద ఆస్తి అంటూ రూ.25,914.13 కోట్లు, అవ్వాతాతలకు ఇంటి ఇంటికి రూ.37,461.89 కోట్ల పెన్షన్లు పంపిణీ, అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత.. ఇలా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్నామన్నారు. అయితే అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన మండిపడ్డారు.