జాతీయం

చనిపోయిన వ్యక్తికి.. కరోనా టీకా రెండో డోసు!

చనిపోయిన వ్యక్తి.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. నమ్మడం లేదా.. ఒక సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు బయటపడింది. గుజరాత్‌ రాష్ట్రం బనస్కాంతలోని పాలన్‌పూర్‌ పట్టణానికి చెందిన ముఖేష్ జోషి మూడు నెలల కిందట కరోనా టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత మరణించాడు. అయితే ఆయన మొబైల్‌ ఫోన్‌ను కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. కాగా, జోషి కరోనా టీకా రెండో డోసు తీసుకున్నట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తికి టీకా రెండో డోసు ఎలా వేశారంటూ నోరెళ్లబెట్టారు. ఈ విషయం కాస్త విస్తృతంగా ప్రచారం అయ్యింది.

దీనిపై స్పందించిన అధికారులు సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. వివరాలను నమోదు చేసినప్పుడు వ్యాక్సిన్ పొందిన వ్యక్తికి బదులుగా మరణించిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఆరోగ్య కార్యకర్త తప్పుగా నమోదు చేసినట్లు బనస్కాంత ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జిగ్నేష్ హర్యానీ తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న వెంటనే జోషి చనిపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు.

రెండవ డోసు తీసుకోవాల్సిన వ్యక్తుల జాబితా నుంచి జోషి పేరును తొలగించలేదన్నారు. దీంతో రెండో డోసు స్లాట్‌లో పేరు కనిపించడంతో ఆపరేటర్‌ పొరపాటున ఆయన మొబైల్‌ నంబర్‌ను రెండో డోసు తీసుకున్న వారి జాబితాలో ఎంటర్‌ చేశారని చెప్పారు. ఈ పొరపాటు చేసిన సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు జిగ్నేష్ హర్యానీ వెల్లడించారు.