భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. లేటరల్ ఫ్లో టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో రవిశాస్త్రితోపాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌లో ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన కూడా చేసింది.
‘బీసీసీఐ మెడికల్ టీమ్ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ను, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌ను ఐసోలేషన్‌లో పెట్టింది. హెడ్ కోచ్ రవిశాస్త్రికి లేటరల్ ఫ్లో టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొన్నది. అదేవిధంగా ఈ నలుగురి నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం శాంపిల్స్ సేకరించారని, రిపోర్ట్స్ కోసం వేచిచూస్తున్నామని బీసీసీఐ అధికారులు తెలిపారు.
రవిశాస్త్రికి పాజిటివ్ వచ్చినందున ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టెస్టు నాలుగో రోజు ఆడేందుకు వెళ్లిన బృందంతో ఈ నలుగురు వెళ్లలేదని, వాళ్లకు కేటాయించిన హోటల్ రూమ్‌లలోనే ఉన్నారని బీసీసీఐ వెల్లడించింది. టీమిండియా వైద్య బృందం నిర్ధారించే వరకు వాళ్లు హోటల్ గదుల్లోనే ఉంటారని తెలిపింది. కాగా, ఓవల్ టెస్టు ఆడుతున్న తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లతోపాటు సిబ్బందికి గత రాత్రి ఒకసారి, ఈ ఉదయం ఒకసారి రెండు దఫాల్లో లేటరల్ ఫ్లో టెస్టులు నిర్వహించారు. ఆ రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే మ్యాచ్ జరుగుతున్న ఓవల్ స్టేడియానికి అనుమతించారు.