ప్రస్తుతం దీక్ష చేపట్టిన ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినప్పటికీ.. ఈ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ (Rakesh Tikait) హెచ్చరించారు. కేంద్రం తమ గోడును పెడ చెవిన పెడుతున్నదని, ఇక వెనక్కి తగ్గేది లేదన్నారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ శివారులో నిరసనలు తెలుపుతున్నప్పటికీ కేంద్రం వినిపించుకోకపోవడం విచారకరమన్నారు. ముజఫ్ఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ బహిరంగ సభకు రాకేశ్ తికాయత్ హాజరై కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ‘కేంద్రం ఏం చేసినా పర్వాలేదు. ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినా భయపడేది లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు.
‘ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుంది. స్వాతంత్య్రం కోసం జరిగినట్లుగానే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ రైతులు చేరింది ప్రభుత్వం తమ అసంబద్ధ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడానికే’ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌కు 15 రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేసింది.