ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రూ.5.60 కోట్లకు మహిళ టోకరా

చీటీల పేరుతో ఓ మహిళ తమను మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌లోని చినగంజాం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పలువురు బాధితులు శనివారం చినగంజాం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. సుమారు 40 మందికి పైగా బాధితులు కుటుంబ సభ్యులతో సహా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీస్‌ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోపిరాల గ్రామానికి చెందిన మహిళ సుమారు రూ.5.60 కోట్ల నగదు తమకు చెల్లించాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. సీఐ పీ సుబ్బారావు, ఎస్‌ఐ పీ అంకమ్మరావులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పోలకం ఝాన్సీ లక్ష్మి… 25 ఏళ్ల నుంచి గ్రామంలో చీటీపాటలు నిర్వహిస్తోంది. చీటీపాటలపై వచ్చే కమీషన్‌తో పాటు, రొక్కంగా మరి కొంత సొమ్ము వడ్డీకి తీసుకొని, వారికి వడ్డీ కడుతోంది. అయితే గత ఏడాది నుంచి వడ్డీలు చెల్లించక, అందరి చీటీ పాటలు తానే పాడుకొని సుమారు రూ.5.60 కోట్ల నగదు వసూలు చేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

చీటీ పాడిన లబి్ధదారులకు సైతం డబ్బులు చెల్లించక కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితులకు ఎటువంటి తేదీ, ఇతర వివరాలు నమోదు చేయకుండా ఖాళీగా ఉన్న ప్రామిసరీ నోటుపై కేవలం సంతకాలు చేసి ఇచ్చి వారికి నమ్మకం కలిగేలా చేసింది. ఒక్కొక్క బాధితునికి సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిప్పుకుంటోంది. కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవుతున్న చీటీ సభ్యులు తమ నగదు గురించి అడుగగా ఆమె తమ కుమార్తెకు, కుమారునికి నగదు ఇచ్చినట్లు, వీరితో పాటు తమ బంధువులకు నగదు ఇచ్చినట్లు బాధితుల వద్ద ఒప్పుకొని వాయిదాల పద్ధతిలో బాకీ తీరుస్తానని నమ్మబలుకుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో తనకు సంబంధించిన గృహం, ఇతర ఆస్తులను  బంధువుల పేరుతో రిజి్రస్టేషన్‌ చేయించడంతో అనుమానం వచ్చిన బాధితులు శనివారం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల గోడు విన్న ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితురాలిని విచారించిన అనంతరం కేసు నమోదు చేశామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.