వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేరొందిన రాజా మహేంద్ర సింగ్ పేరుతో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు యోగి సర్కార్ పూనుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అలీఘఢ్‌లో ఈనెల 14న రాజా మహేంద్ర సింగ్ స్టేట్ యూనివర్సిటీకి శంకుస్ధాపన చేయనున్నారు.
జాట్ ప్రాబల్య పశ్చిమ యూపీలో రైతుల నిరసనలు హోరెత్తిన క్రమంలో జాట్ వర్గానికి చెందిన సింగ్ పేరుతో వర్సిటీ ఏర్పాటు కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహేంద్ర సింగ్ గతంలో అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ కోసం తన భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో పలువురు ఆరెస్సెస్, బీజేపీ నేతలు అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ పేరును మహేంద్ర సింగ్ యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌ను తిరస్కరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సింగ్ పేరుతో రాష్ట్రస్ధాయిలో ఓ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది జులైలో వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ రూ 1500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు.