ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి మిగులు జలాలను దిగువకు విడుదల చేయడతో గోదావరి ఉధృతంగా మారిందన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోందని తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల ఆరు వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందన్నారు. దీంతో ఉదయం 10 గంటలకు 33 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 3,06,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు, భక్తులు నది తీరా ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. జెన్‌కోకు 7500 క్యూసెక్కులు (ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 7వేలు, కాతీయ కాలువకు 500 క్యూసెక్కుల) నీటి విడుదల కొనసాగుతోందన్నారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1089.60 అడుగుల(82.734 టీఎంసీలు) వద్ద ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో 181.856 టీఎంసీల వరద వచ్చిందన్నారు.