REVANTH
తెలంగాణ రాజకీయం

కులగణనకు  అసెంబ్లీ తీర్మానం

బీసీ కులగణన విషయంలో ఎలాంటి అపోహలొద్దని.. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనపై శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా.. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా.? అని ప్రశ్నించారు.తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం ప్రవేశపెట్టామని.. ఎవరూ అడగకుండానే సభలో ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ అన్నారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘కులగణనపై చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోంది. కులగణనను అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులపై అనుమానం ఉంటే సూచనలివ్వండి.

అంతేకానీ, తీర్మానానికే చట్టబద్ధత లేదన్నట్లుగా మాట్లాడడం మనందరికీ మంచిది కాదు. మేం రహస్యంగా ఏమీ చేయడం లేదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉండొచ్చు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం. లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్న వాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న బాధ ఉంటుందేమో.?. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది పక్కన కూర్చోవడంతో ఆయన్నూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంత మంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను మేం పరిగణలోకి తీసుకుంటాం.’ అని రేవంత్ స్పష్టం చేశారు.కులగణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకు కులగణన ప్రక్రియ చేపట్టామని అన్నారు.

దీనిపై మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని గొప్పలు చెప్పుకొనే బీఆర్ఎస్ నేతలు.. ఆ సర్వేను సభలో ప్రవేశపెట్టారా.? అని నిలదీశారు. ‘మేనిఫెస్టోలపై ఓ రోజు చర్చిద్దాం. 2014, 2018, 2023లో పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేకంగా చర్చిద్దాం. ఈ పదేళ్లు మీరేం చేశారు. ఈ 60 రోజుల్లో మేం ఏం చేశామో చర్చిద్దాం. సభలో తీర్మానం ప్రవేశపెట్టింది మేమే’ అని సీఎం స్పష్టం చేశారు.

మంచిదే కానీ తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్  శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కుల గణన చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి.. ప్రజల ఆర్థిక స్థితి గతులు తెలుసుకుంటామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందు పరుస్తామని.. సర్వ రోగ నివారిణిలా సర్వే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత కడియం తెలిపారు.’అసెంబ్లీలో బీసీ కులగ‌ణ‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం దేశ చ‌రిత్ర‌లోనే చారిత్రాత్మ‌కం. దేశంలోని సంప‌ద‌, రాజ్యాధికారం జ‌నాభా దామాషా ప్ర‌కారం ద‌క్కాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందు కోసమే ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా కుల‌గ‌ణ‌నతో పాటు  సోష‌ల్‌, ఎకాన‌మిక్‌, ఎడ్యుకేష‌న్‌, పొలిటికల్, ఎంప్లాయిమెంట్ అంశాల‌పై స‌ర్వే చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగ‌త‌ల‌పై స‌ర్వే నిర్వహిస్తాం. ఈ స‌ర్వే ద్వారా సంప‌దను అన్ని వ‌ర్గాల‌కు జ‌నాభా ద‌మాషా ప్ర‌కారం ఎలా పంచాల‌న్న‌ దానిపై ప్ర‌ణాళిక‌లు త‌యారు చేస్తాం.

సామాజిక ఆర్ధిక రాజకీయ మార్పున‌కు పునాదిగా తెలంగాణ మార‌బోతుంది.’ అని భట్టి తెలిపారు.అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ‘జనం, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు. కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది. తీర్మానానికి చట్ట బద్ధత అయినా కల్పించాలి. లేదా న్యాయపరంగా అయినా ముందుకు వెళ్లాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.’ అని పేర్కొన్నారు.దీనిపై మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రతిపక్షాలకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వొచ్చని.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

అయితే, పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. తీర్మానం కాదు చట్టం చేయాలని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకూ అవకాశం ఉండకూడదని చెప్పారు. ‘కులగణన పూర్తి కాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.’ అని పేర్కొన్నారు.ఎంబీసీలను మొదట గుర్తించినదే తెలంగాణ సీఎం కేసీఆర్ అని గంగుల ఈ సందర్భంగా అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని.. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ లో ఇప్పటికే కుల గణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గుర్తు చేశారు.