తాలిబన్.. ఆఫ్ఘనిస్థాన్ సహా ప్రపంచాన్ని అటెన్షన్ అనిపిస్తున్న పదం ఇది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవటంతో అరాచక పాలనకు పెట్టింది పేరుగా ఉన్న తాలిబన్లు దేశాన్ని మళ్లీ హస్తగతం చేసుకున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా గతంలో మాదిరే పాలన సాగిస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అసలు.. గత ఐదు దశాబ్దాలుగా ఆప్ఘనిస్థాన్‌లో ఏం జరిగిందని ఆరా తీస్తే రెండు పెద్ద దేశాల కొట్లాటలో ఈ పేద దేశం కొట్టుమిట్టాడుతున్నదని, తనలో తానే కొట్టుకుంటున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
అది 1933-1973 మధ్య కాలం.. ఆఫ్ఘనిస్థాన్‌లో మహ్మద్ జాహిర్షా రాజ్యం కొనసాగింది. ఆ సమయంలో ఆ దేశంలో పరిస్థితులు నిలకడగానే ఉండేవి. 1973లో జాహిర్షా బావమరిది సర్దార్ దావూద్ ఖాన్ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. 1978లో అతన్ని, అతని పరివారాన్ని ఆఫ్ఘన్ కమ్యూనిస్టులు హత్య చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తిరుగుబాటును ఖల్క్ విప్లవం అంటారు. ఆ క్షణం నుంచే ఆఫ్ఘనిస్థాన్ అగ్ని గుండంలా మారింది. అప్పటికే అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. ఈ సమీకరణాల్లో భాగంగా ఆఫ్ఘన్ ప్రభుత్వ వ్యతిరేక ముజాహిదీన్ బలగాలకు పాకిస్థాన్ ఐఎస్ఐ ద్వారా అమెరికా సహకారాన్ని అందించింది.
20 లక్షల మంది ఆఫ్ఘన్ల మృతి
ముజాహిదీన్ బలగాలను ఎదుర్కొనేందుకు ఆఫ్ఘన్ కమ్యూనిస్టు ప్రభుత్వం-సోవియట్ యూనియన్ చేతులు కలిపాయి. ఒప్పందంలో భాగంగా స్థానిక ప్రభుత్వానికి రక్షణగా 1979 డిసెంబర్ 24న దాదాపు లక్ష మంది సోవియట్ యూనియన్ సైనికులు ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ సైన్యం లక్షమంది అప్పటికే ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు పదేండ్ల పాటు అంతర్యుద్ధం జరిగింది. అటు ముజాహిదీన్ బలగాలకు అమెరికా, స్థానిక ప్రభుత్వానికి సోవియట్ యూనియన్ మద్దతు ఇవ్వగా, ఈ క్రమంలో దాదాపు 20 లక్షల మంది ఆఫ్ఘన్ వాసులు మరణించినట్టు అంచనా. 50 లక్షల మంది పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.
పెరిగిన దొపిడీలు, లంచగొండితనం
అయితే, 1989లో సోవియట్ సేనలు వెనక్కి వెళ్లాయి. ఇది తమ నైతిక విజయం అని అమెరికా భావిస్తున్నది. ఆ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్థాన్ ను పట్టించుకోలేదని విశ్లేషకులు తెలిపారు. 1992 వరకు రష్యా మద్దతుతో నజీబుల్లా ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ లో కొనసాగింది. ఆ తర్వాత పతనమైంది. అప్పటికే ఆ దేశం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి చెదిరిపోయింది. విద్యావంతులు, మేధావులు వలసవెళ్లిపోయారు. నాయకత్వం లేదు. 1994లో కాబూల్ లో జరిగిన ఘర్షణలో పదివేల మందికి పైగా మరణించారు. రోజూవారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగాయి.
బలమైన శక్తిగా తాలిబన్లు
ఇదే సమయంలో తాలిబన్లు బలమైన శక్తిగా ఎదిగి, 1996లో కాబూల్ ను వశం చేసుకున్నారు. 2000 సంవత్సరం నాటికి దేశంలోని 95 శాతం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. వాళ్లు షరియా చట్టాన్ని తీవ్రంగా అమలు చేశారు. ఈ కాలంలో ప్రజలు అరిగోస పడ్డారు. ప్రజల జీవనం, స్వేచ్ఛ దెబ్బతిన్నది. స్త్రీలు, బాలికలకు చదువు, ఉద్యోగాలు నిషేధించారు. దారుణంగా శిక్షలు విధించారు. కమ్యూనిస్టులు అనేవాళ్లే లేకుండా చేశారు.
2001లో అమెరికా ఎంట్రీ
2001 సెప్టెంబర్ 11న అమెరికాపై అల్ ఖైదా ఉగ్రదాడులు చేసింది. దీంతో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ చర్యను అమెరికా ప్రారంభించింది. బిన్ లాడెన్ ను అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరించింది. అందుకు తాలిబన్లు ఒప్పుకోలేదు. కాబూల్‌లోకి యాంటీ తాలిబన్ రెబల్స్, నార్తన్స్ అలయన్స్ ఎంట్రీ ఇవ్వటంతో నగరాన్ని విడిచి తాలిబన్లు పారిపోయారు. 2002లో హమీద్ కర్జాయి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2003లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. 2004 ఎన్నికల్లో కర్జాయి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005లో సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పాటైంది. అదే సమయంలో 28 శాతం మంది స్త్రీలకు సీట్లు కేటాయించారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ గణతంత్ర రాజ్యంగానే కొనసాగింది.
తాలిబన్ల రీ ఎంట్రీ
2011 మే 2న బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేశాక, 2014లో కాంబోట్ ఆపరేషన్లను నాటో దళాలు నిలిపివేశాయి. 2015లో తాలిబన్లు తమ ప్రతాపాన్ని చూపించటం మొదలుపెట్టారు. కాబూల్ సహా పలు చోట్ల బాంబుదాడులకు తెగబడ్డారు. 2014లో అఫ్రఫ్ ఘనీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి 45వేల ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్ల దాడుల్లో అంతమైంది. అయితే, 2020 ఫిబ్రవరి 29న తాలిబన్లు, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 14 నెలల్లో దేశాన్ని ఖాళీ చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అన్నట్టుగానే అమెరికా సైన్యం వెనక్కి వెళ్లటంతో తాలిబన్లు ఒక్కొక్కటిగా అన్ని నగరాలను ఆక్రమించుకున్నారు. ఇప్పుడు దేశాన్ని హస్తగతం చేసుకొని ‘తాలిబన్’ మార్కు పాలన అందించేందుకు రెడీ అయ్యారు.