అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Joe Biden : జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) ప్రజాదరణ తగ్గిపోతున్నది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా తక్కువ సమయంలో ఇంతగా పాపులారిటీ పోగొట్టుకున్న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇప్పటికిప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిపితే జో బైడెన్‌ చాలా ఇబ్బంది పడతాడు. డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి అధికారంలోకి వచ్చే వాడు. ఈ విషయాలను అమెరికాకు చెందిన ఎమర్షన్‌ కాలేజీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేను ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు నిర్వహించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకున్న కారణంగా జో బైడెన్‌ తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటున్నారు. విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎమర్షన్‌ కాలేజీ నిర్వహించిన సర్వేలో దాదాపు 47 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటేశారు. ఒక శాతం తక్కువగా బైడెన్‌కు 46 శాతం మంది మద్దతుగా నిలిచారు. 2024 లో అధ్యక్ష పదవికి బైడెన్, ట్రంప్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అని సర్వేలో ప్రశ్నించారు. 60 శాతం మంది డెమోక్రాట్లు 2024 లో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో, 67 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను తమ అభ్యర్థిగా పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఎవరు ఎక్కువ బాధ్యత వహించాలి? అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా.. ట్రంప్‌కు ప్రజల నుంచి మద్దతు లభించింది. 49 శాతం మంది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ బాధ్యత వహించాలనగా.. 24 శాతం మంది బైడెన్, 18 శాతం మంది బరాక్ ఒబామా తప్పని వెల్లడించారు.

ఏప్రిల్‌లో ముందుండి.. ఆగస్ట్‌లో తగ్గి..

గత నెల 17 న జరిగిన ఒక సర్వేలో, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని ఎదుర్కోవడానికి ట్రంప్ సరైన చర్యలు తీసుకున్నారని 25 శాతం మంది చెప్పగా.. సైన్యం ఉపసంహరణపై 60 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బైడెన్ ప్రజాదరణ ఏప్రిల్‌లో 53 శాతం నుంచి 49 శాతంగా ఉండగా.. ఆగస్ట్‌ నెలాఖరుకు దాదాపు 7 శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది నవంబర్ నెలలో యూఎస్‌లో ప్రతినిధుల సభ, సెనేట్‌ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి.