అంతర్జాతీయం ముఖ్యాంశాలు

China army : యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్‌

చైనా ఆర్మీకి సంబంధించిన విషయాలను ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అందులోనూ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఊసే ఉండదు. తమ వద్ద ఎంత సైన్యం ఉన్నది, ఎన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తి ఉన్నది చైనా అసలే బయటపెట్టదు. ఈ నేపథ్యంలో చైనా ఆర్మీకి (China army) సంబంధించిన పలు విషయాలను అమెరికా డాక్యుమెంట్‌ రూపంలో బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్‌ను అమెరికా ఆర్మీ విడుదల చేసింది. 252 పేజీలుగా ఉన్న ఈ నివేదికకు ‘ఏటీపీ 7-100.3’ అని పేరు పెట్టింది. ఈ నివేదిక చైనా పీపుల్స్‌ ఆర్మీ నిర్మాణం, సామర్ధ్యం గురించి వెల్లడిస్తుంది. అమెరికా ఆర్మీ శిక్షణ కోసం ఈ డాక్యుమెంట్‌ రూపొందించారు.

చైనా రక్షణాత్మకంగా భావించే పలు నిర్ణయాలు, ఇతర దేశాలకు దూకుడుగా ఉంటాయని ఈ నివేదికలో వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలనే నిర్ణయం దీనికి సరైన ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, డాక్యుమెంట్‌లో చైనా సైన్యం గురించి మాత్రమే ప్రస్తావించారు. 20 సంవత్సరాల పాటు చైనా సైన్యాన్ని నిరంతరం చూసిన తర్వాత అమెరికా ఈ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది.