భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో నిలిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కార్యకర్తల సమావేశంలో దీదీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తమ పార్టీ నేతలకు ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలు సమన్లు జారీ చేస్తున్నాయని అన్నారు.
బీజేపీ కుట్రపూరిత రాజకీయాలతోనే తాను నందిగ్రాంలో ఓడిపోయానని దీదీ పేర్కొన్నారు.సీఎం పదవిలో కొనసాగాలంటే మమతా బెనర్జీ ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండటంతో భవానీపూర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భవానీపూర్ ఉప ఎన్నికకు దూరంగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించగా ఒకట్రెండు రోజుల్లో తమ అభ్యర్ధిని ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది. భవానీపూర్ ఉప ఎన్నిక సెప్టెంబర్ 30న జరుగుతుందని ఈసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలసిందే.