జాతీయం ముఖ్యాంశాలు

Chit Fund Scam Case | చిట్‌ఫండ్‌ స్కామ్‌ కేసుల్లో బెంగాల్‌ మంత్రికి సీబీఐ నోటీసులు

ఐ-కోర్‌ చిట్‌ఫండ్‌ స్కామ్‌ కేసులో బెంగాల్‌ వాణిజ్యం, పరిశ్రమలశాఖ మంత్రి పార్థ ఛటర్జీని విచారణకు రావాలని సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలున్నాయి. ఎక్కువ మొత్తంలో రిటర్నులు వస్తాయంటూ పెట్టుబ‌డిదారుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోస‌గించార‌ని ఐ-కోర్ మీద ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే మరో కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడిని తొమ్మిది గంటల పాటు విచారించింది. మమతా బెనర్జీ బుధవారం జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ అభిషేక్‌ బెనర్జీకి ఈడీ నోటీసుపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ ఓటర్ల తీర్పును బీజేపీ అంగీకరించలేదని ఆరోపించారు. తప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అభిషేక్‌ను ఢిల్లీకి పిలిచి తొమ్మిది గంటల పాటు ప్రశ్నించడం వెనుక కారణం ఏంటీ? అంటూ ప్రశ్నించారు.