జాతీయం

Deepotsav | మరో గిన్నిస్‌ రికార్డు దిశగా అయోధ్య!

ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్‌ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 2017 నుంచి సరయూ నదీ తీరాన దీపోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. ఈ సారి రామ్‌కీ పైరి ఘాట్‌పై 7.5లక్షల దివ్వెలను వెలిగించి గత రికార్డును తిరగరాసే దిశగా ముందుకెళ్తోంది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దీపోత్సవం నిర్వహించడం ఇది ఐదోసారి.

Deepotsav | మరో గిన్నిస్‌ రికార్డు దిశగా అయోధ్య!

వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు ఇదే చివరి దీపోత్సవం. వేడుకకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని అధికారులు తెలిపారు. దీపోత్సవంలో దాదాపు 7వేల మంది వలంటీర్లు పాల్గొంటారని అయోధ్య పరిపాలన తెలిపింది. ఇందులో ఎక్కువ మందిని వలంటీర్లుగా అయోధ్యలోని రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్ యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుంటున్నట్లు జిల్లా పరిపాలన తెలిపింది. కార్యక్రమానికి ముందు సజావుగా సాగేందుకు అయోధ్య అడ్మినిస్ట్రేషన్‌ మూడుసార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించనుంది.

దీపాలను వెలిగించడంతో లేజర్‌ షోను సైతం నిర్వహించనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం దీపోత్సవానికి హాజరవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 7.5 లక్షల దీపాలు వెలిగించి కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధిస్తామని బీజేపీ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా తెలిపారు. ఈ మేరకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో రికార్డు స్థాయిలో స్థాయిలో 4,10,000 దీపాలు వెలిగించారు. 2020లో సరయూ నది వెంట ఉన్న రామ్‌కీ పైరి ఘాట్‌ వద్ద 6,06,569 దివ్వెలు వెలిగించి రికార్డు సృష్టించారు. అయితే, కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఉత్సవాలకు స్థానికులను మాత్రమే అనుమతి ఇచ్చారు.