సరిహద్దుల్లో యుద్ధ విమానాలను అత్యవసరంగా దింపేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్‌ను (First Air Strip) నిర్మించారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లోని అగడావా వద్ద ఈ ఎయిర్ స్ట్రిప్‌ను ఏర్పాటుచేశారు. దీనిని పూర్తిగా జాతీయ రహదారి-925 ఏ పైనే నిర్మించడం విశేషం. దేశంలోనే తొలి ఎయిర్ స్ట్రిప్‌ను గురువారం ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీలు సంయుక్తంగా ప్రారంభిస్తారు.
రాజస్థాన్ బార్మర్-జాలోర్ జిల్లాలోని సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. విమానాలను దింపడాన్ని బుధవారం పరిశీలించారు. మిగ్, సుఖోయ్, హెర్క్యులస్ యుద్ధ విమానాలను దింపడంపై రిహార్సల్స్ జరిపారు. ఉదయం వైమానిక దళం అధికారుల పర్యవేక్షణలో తొలిసారి ఈ స్ట్రిప్‌పై హెర్క్యులస్ విమానాన్ని విజయవంతంగా దింపారు. ఆ తర్వాత అగస్టా హెలికాప్టర్‌తోపాటు సుఖోయ్, మిగ్‌లను ల్యాండింగ్ చేశారు. ఈ రిహార్సల్స్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది.
ఈ ఎయిర్ స్ట్రిప్‌ను 3 కిలో మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో భారత్‌మాలా ప్రాజెక్టు కింద రూ.32.95 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేశారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి కేవలం 40 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్ట్రిప్ ఉన్నది. జాతీయ రహదారికి ఇరువైపులా విమానాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ లాట్ కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ కూడా ఉన్నది. ఇలాంటివి దేశవ్యాప్తంగా మరో 12 నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో తొలి ‘టచ్ అండ్ గో’ ఆపరేషన్ గురువారం మధ్యాహ్నం ప్రారంభం కానున్నది. వైమానిక దళానికి చెందిన అనేక యుద్ధ విమానాలు గర్జిస్తూ ఈ ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ అవనున్నాయి.