తెలంగాణ

Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్‌

రాష్ట్రంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోపు వందశాతం వ్యాక్సినేషన్‌ను చేరుకోవాలని ఆదేశించింది.

కనీసం సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్‌ అయినా వేయించుకోవాలని చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలలను కలుపుకుంటే మొత్తంగా 3.74లక్షల మంది టీచర్లు, సిబ్బంది ఉండగా.. వారిలో ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే, మిగిలిన 40వేల మందిలో కొంత మంది గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డ వారున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిని మినహాయించి మిగతా వారందరికీ వ్యాక్సిన్లు వేసి 100శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు తెలిపారు.