అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంతో అంతరిక్ష కేంద్రంలో పొగ వ్యాపించి.. దాంతో స్మోక్ అలారమ్‌లూ మోగాయి. ఈ ఘటన స్పేస్ స్టేషన్‌లో ఉన్న రష్యా మాడ్యూల్‌లో జరిగింది. జ్వెజ్‌దా మ్యాడూల్‌లోనే ఆస్ట్రోనాట్లు నివసించే క్వార్టర్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో అంతరిక్ష కేంద్రంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్టమ్స్ నిర్జీవం కావడమే కారణమని ఓ రష్యా అధికారి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. అయితే అన్ని సిస్టమ్స్ మళ్లీ సాధారణ స్థాయికి వచ్చినట్లు రాస్కాస్మోస్ స్పేస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో బ్యాటరీలను రీచార్జింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రోనాట్లు పొగను గుర్తించారు. ప్లాస్టిక్ కాలిన వాసనను వాళ్లు పసికట్టారు. రష్యా సెగ్మెంట్ నుంచి అమెరికా మాడ్యూల్ ఉన్న ప్రాంతానికి ఆ వాసన పాకినట్లు గుర్తించారు. ఫిల్టర్‌ను ఆన్ చేసిన తర్వాత అక్కడ గాలి క్లీనైట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఫిక్స్ చేసిన సమయం ప్రకారమే గురువారం స్పేస్‌వాక్ ఉంటుందని నాసా పేర్కొన్నది. ఇటీవలే స్పేస్ స్టేషన్‌కు నౌకా సైన్స్ మాడ్యూల్‌ను రష్యా పంపించింది. ప్రస్తుతం దాన్ని ఇద్దరు కాస్మోనాట్స్ ఫిక్స్ చేస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని.. 1998లో నిర్మించారు. రష్యా, అమెరికా, కెనడా, జపాన్‌తో పాటు యురోపియన్ దేశాలు దీన్ని చేపట్టాయి. 15 ఏళ్ల జీవితకాలంతో దీన్ని డిజైన్ చేశారు. రెండు నెలల క్రితం త్రస్టర్లు ఆకస్మికంగా ఆన్‌కావడంతో.. స్పేస్ స్టేషన్ కొంత పక్కకు జరిగిన విషయం తెలిసిందే.